Charitam
శ్రీరామనవమి నాడు పుట్టి ఆ రాముడే శ్వాసగా బతికిన మహనీయులు శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు.రాముడి చరిత్రను రామాయణంగా లోకానికి అందించి మహా ఉపకారం చేశారు వాల్మీకి మహర్షి, ఆ రామాయణాన్ని రమణీయంగా వాడ వాడలా వినిపించి మనందరికి ఆ రాముడి రూపాన్ని,గుణాలను కనిపించేలా చేశారు శ్రీభాష్యం వారు...వారిని గురించి కొన్ని ముత్యపు చినుకులు...
చిన్ని శిశువు...చిన్ని శిశువు:
సింహాద్రినాధుని వరప్రసాదంగా,పద్మనాభుని ముద్దు బిడ్డ అయి,శ్రీనివాసచార్యులు తిరువెంగళమ్మ దంపతులకు 1922 సంవత్సరం ఏప్రిల్ 6న శ్రీరామనవమి నాడు విశాఖపట్నం జిల్లా పద్మనాభం లో జన్మించారు అనంత అప్పలాచార్యులు గారు.
వసుదేవుని పాలిట వర తపోధనము యొసగి దేవకి దేవి ఎదపై సొమ్ము:
తల్లినుండి కృష్ణ భక్తిని.. తండ్రి నుండి రామానురక్తిని అందిపుచ్చుకున్నారు.4 సంవత్సరాల వయస్సులోనే ముకుందమాల ,దాశరథి శతకం తడబడకుండా చెప్పగలిగే భగవత్ కృపని పొందారు.మేనత్తకు అందాల మేనల్లుడు,అక్కలకు ముద్దుల తమ్ముడు అయినా సరే తల్లి దగ్గర మాత్రం ప్రేమతో కూడిన క్రమశిక్షణ ఉండేది.అమ్మా అంత కళ్ళు పెట్టి చూడకమ్మా ..అల్లరి చెయ్యనుగా అంటూ అమ్మఒడిలోకి చేరిపోయేవాడట
అబ్బురంపు శిశువు....పుట్టుకతొల్లే మారు పుట్టువైన శిశువు:
5 సంవత్సరాల చిన్న వయసులోనే తల్లిని కోల్పోయినా ఆ లోటు రానివ్వకుండా అపురూపం గా చూసుకున్నారు పెత్తల్లి తిరువెంగళమ్మ గారు .చదువు మీద తండ్రికి ఉన్న ఆసక్తి కారణం గా పద్మనాభం నుంచి విజయనగరం వచ్చి అక్కడ పెత్తల్లి ఇంట్లో ఉండి చదువుకున్నారు.ఆవిడకన్నా అపురూపం గా చూసుకున్నారు వదిన ,అన్నయ్యలు.వదినగారికి ముద్దుల మరిది.ఆయన గారాలన్ని ఆమె దగ్గరే.అన్నయ్య శ్రీభాష్యం భాష్యకారాచార్యులు గారంటే గౌరవం తో కూడిన భయభక్తులు.ఆయన తన చదువు కంటే తమ్ముడు అనంతప్పడి చదువు మీదే శ్రద్ధ ఎక్కువగా చూపేవారట.
చెలగునాచార్యసేవే జీవన్ముక్తి:
మహానుభావుడైన గురువు ఒక్కడు చాలు ఒక విద్యార్థిని మంచి మార్గం లో నడపడానికి.అలాంటిది
మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయశాస్త్రి గారు,శ్రీమత్ కోయిల్ కందాడై రామాచార్యులు గారు,కర్రి శ్రీరామమూర్తి గారు,పేరి సూర్యనారాయణ శాస్త్రి గారు వంటి ఎందరో మహామహుల వద్ద విద్యని అభ్యసించిన ఆ విద్యార్థి మంచి మార్గం లో పయనించడం లో ఆశ్చర్యమేముంది.వారి మార్గదర్శకత్వం వల్ల,బోధనా విధానాల వల్ల సంస్కృతం మీద విపరీతం అయిన ఆసక్తి కలిగింది వీరికి.వారి వద్ద వ్యాకరణ విద్యా ప్రవీణ పూర్తి చేసేరు.
తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి M. A పట్టా పొందారు.భాషా ప్రవీణ కూడా పూర్తి చేసేరు.
వరించి వచ్చిందతనిని కొలువు:
పుట్టకొండ లో ఆరంభం చేసి చోడవరం, శ్రీకాకుళం,మెడ్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో, మద్రాస్ నుండి విడిపడి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్కడ నుండి మళ్ళీ శ్రీకాకుళం,కాకినాడ,రాజమండ్రి లలో ఉద్యోగం చేసి ఎందరినో విద్యావంతులు గా తీర్చిదిద్దేరు.ఎందరికో ప్రియతమ ఉపాధ్యాయులు అయ్యేరు.
పలుకులు మదువంతుంపులు...సల్లాపాలు సరస్వతీ వీణాలాపాలు:
రాజమండ్రిలో సంపత్ రాఘవాచార్యులు గారు,మల్లంపల్లి శరభయ్య గారు,మానాప్రగడ శేషశాయి గారు,తనికెళ్ళ శ్రీరామమూర్తి గారు,అప్పలాచార్యులు గారు ఐదు శరీరాలు ఒకటే ప్రాణం .వీరిమధ్య జరిగే సాహితీ చర్చలు రసవత్తరం.మొదలు అవడమే కానీ ఆగేవి కావట...మానాప్రగడ శేషసాయిగారి ద్వారా విశ్వనాథ , కాటూరి,పుట్టపర్తి, దేవులపల్లి వంటి ఎందరో మహానుభావుల పరిచయం కూడా ఏర్పడింది .ప్రెసిడెన్సీ కళాశాలలో అప్పలాచార్యులు గారితో పాటు పనిచేసే పోణంగి శ్రీరామ అప్పారావు గారు ఆయన ప్రతిభకు ఆకర్షితులు అయి వారి సహకారంతో భరతుని నాట్యశాస్త్రం ను ఆంధ్రీకరించేరు.కాకినాడలో చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు అప్పలాచార్యుల వారి ప్రతిభను గుర్తించి ఆయనచేత "పస్పసాహ్నికమ్ " తెలుగు సేత చేయించి ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక లో వేయించారు.
1960 లో మొదటి సారిగా వక్తగా అప్పలాచార్యులు గారి ప్రతిభ బయటకు వచ్చింది.దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు హాజరు కాలేకపోయిన కార్యక్రమం లో ఆయనకు బదులుగా ఆచార్యులు గారు కాళిదాస కవితా వైభవం గురించి అనర్గళంగా చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు.ఇది మొదలు అప్పలాచార్యుల వారి వాక్ ప్రవాహమ్ ఎక్కడా ఆగలేదు.
ఆకటికడుగని శిశువును తల్లి యడచి పాలు త్రాగించిన రీతి:
ఉభయ వేదాంత ప్రవర్తకులు,పరమాచార్యులు శ్రీమాన్ తెలికిచర్ల కందాళ గోపాలాచార్య స్వామి వారు, ఆకలిని తెలుసుకోలేని చిన్న పిల్లవాడి ఆకలిని తానే తెలుసుకొని తీర్చే తల్లిలా ...అప్పలాచార్యుల వారి ఇంటికి తానే వచ్చి, అపారమైన కరుణతో తానే శిష్యవరణం చేసి ఆధ్యాత్మిక విద్యను, ఉభయ వేదాంతాలను కటాక్షించేరు..పెద్దజీయర్ స్వామి ,చిన్న జీయర్ స్వామి వంటి ఎందరో జీయర్లకు..కొనప్పాచార్యస్వామి,అప్పలాచార్యస్వామి,వెంకటాచార్యస్వామి వంటి ఇంకెందరో ఆచార్యపురుషులకు ఆచార్యులు అయిన గోపాలాచార్యస్వామి వారి గొప్పతనం మాటల్లో చెప్పగలమా..అటువంటి మహానుభావుల అనుగ్రహం తో ఉభయ వేదంతాలను అధికరించి వారికి ప్రేమపాత్రులు అయ్యారు. గోపాలాచార్య స్వామివారి దగ్గర నేర్చుకున్న శ్రీభాష్య,భగవద్విషయాలను ఆయన కోరికగా ,ఎందరికో నేర్పించి ఆయనకు గురుదక్షిణ చెల్లించుకున్నారు.
ప్రీతినైనా..ప్రాణాభీతినైనా...కలిమిచేతనైనా నిన్నేరీతిగా తలిచిన.... :
రామాయణం,భాగవతం,తిరుప్పావై,ఉపనిషత్తులు,ముకుందమాల,సౌందర్య లహరి మొదలైన వాటిపై అనర్గళమైన ప్రవచనాలు చేసి వాటిలోని సారాన్ని అందరి హృదయాల్లో హత్తుకునే విధంగా మధురం గా అందించారు.రామాయణం చెప్తే ఆచార్యులవారే చెప్పాలి ...వింటే ఆయన నోటంటే వినాలి అనేది ఆరోజుల్లో అందరి మనసుల్లో మెదిలే మాట. ఆ భగవంతుని నామాన్ని ఎలా అయినాసరే తలుచుకుంటే చాలు అదే ముక్తి కి మార్గం అని తెలియచేసి ఎందరి జీవిత గమ్యాలనో మార్చేరు.
వారి ఉపన్యాసాలు ఆంధ్రదేశం లోనే కాక తమిళనాట కూడా విని ఆనందించిన వారు ఎందరో..
తరణికుల తిలకుని...ఘన నీలగాత్రుని...కరుణారసము కురియు కందోయి కలవాని.... :
పలికినప్పుడు మాత్రమే కాదు తలుచుకున్నప్పుడల్లా..నోటిలో అమృతం ఊరించే నామం శ్రీరామ నామం.ఆ నామాన్ని ఊరు వాడా అంతటా తనను ప్రేమించే వారి సహాయం తో వ్యాపింపచేసారు.ఆ ప్రవచనాలు యధాతధంగా కొన్ని ప్రచురింపబడ్డాయి.కొన్ని తత్వదీపికలుగా ముద్రించబడ్డాయి.రామాయణం అన్ని కాండలు ప్రచురింపబడ్డాయి.తండ్రికి ఇష్టమయిన దాశరథి శతకం తత్వదీపిక,తల్లికి ప్రీతిపాత్రమైన ముకుందమాల కు వ్యాఖ్య రాసేరు.విభీషణ శరణాగతి, ఆదిత్య హృదయం,ఏడుకొండలు-ఏడు కాండలు,రాముడు మానవుడే,శ్రీవచన భూషణము,శ్రీతత్వం-భగవత్ తత్వం,గీతాజ్యోతి ..ఇలా చాలానే ఆయన కలం నుంచి జాలువారాయి...
సతతము జీవులకు చైతన్య సూత్రము....అతిశయ భక్తుల జ్ఞానామృతము:
వారి సమకాలీకులు వారి నోటినుండి విని ఆనందించిన ఆ ప్రవచనాలను తర్వాతి కాలం వారికోసం అందించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.తెన్నేటి విశ్వనాధం గారి అనుయాయులు అయిన శ్రీమాన్ దూర్వాసుల భాస్కరమూర్తి గారు షిప్ యార్డ్ లో ఉద్యోగస్తులు. వారు తెన్నేటి వారి ప్రోద్బలంతో శ్రీమాన్ స్వామి వారిని వెన్నంటి ఉండి, ఆయన పుస్తకాల ప్రచురణకు,విశాఖపట్నం లో జరిగే ఆయన కార్యక్రమాలకు పూర్తి బాధ్యత తీసుకున్నారు.అప్పలాచార్యుల వారి తత్వదీపికలు ప్రచురణలోకి రావడానికి భాస్కరమూర్తి గారు ఒక కారణం అయితే,రెండవ కారణం శ్రీమతి లలిత గారు.అప్పలాచార్యులు గారి నోటినుండి వెలువడిన ప్రతి మాటను గ్రంథస్తం చేసిన వ్యక్తి ఆమె.
ఊరికే దొరుకునా ఉన్నతోన్నత సుఖము...:
రామచంద్ర ప్రభువు అనుగ్రహం తో ఎన్నో బిరుదులు సన్మానాలు వరించాయి అప్పలాచార్యులు గారిని
1.పిన్నమనేని సీతాదేవి ఫౌండషన్ అవార్డు
2.రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డ్
3.అంబికా సాహిత్య అవార్డ్
4.జగద్గురుపీఠం పురస్కారం
5.గోపాలోపాయనం
6.ప్రపంచ తెలుగు మహాసభలలో తెలుగుతల్లి పురస్కారం
7.శ్రీ సద్గురు శివానందమూర్తిగారి వైదిక పురస్కారం
8.తెన్నేటి విశ్వనాధం జయంతి స్వర్ణ కంకణ పురస్కారం
9.సౌందర్య లహరి స్వర్ణ కంకణ పురస్కారం.
10.విశాఖ NRI వారి పురస్కారం ఇలా ఎన్నో పురస్కారాలు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేయి
ఆఖరుగా 2003 లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ (తిరుపతి)వారి "మహామహోపాధ్యాయ "బిరుదు కూడా వారిని వచ్చి చేరింది.
తిట్టేటి మాటలను...దీవించే మాటలను అట్టే సరియని తలచిన నాతడే సుఖి... :
పాండిత్యం కలిగి కూడా వినయం,ధనాపేక్ష లేకపోవడం,అందరిమీద సమత్వ బుద్ధి కలిగి ఉండడం అన్నవి వారికే చెల్లాయి.పొగడ్తలకు పొంగిపోవడం..తెగిడితే కుంగిపోవడం ఆయన లక్షణమే కాదు.చక్కటి చిరునవ్వుతో, ఎదురుపడ్డ వారిని తానే ముందుగా పలకరిస్తూ, అందరినీ తనతో కలుపుకుంటూ ,ముందుకు సాగే గుణం ఆయన సొంతం.
తగుదువు నీవు ఆమెకిక..తగ్గక ఆమెయూ నీకు సాటియౌ.. :
రామచంద్రప్రభువుకి తన తండ్రి కి నచ్చిన వధువు కనుక సీతమ్మ అంటే ఇష్టమట.అలాగే అప్పలాచార్యులు గారికి కూడా తన తండ్రి ఎంచిన వధువు కనుక భార్య తిరువెంగళమ్మ గారి మీద అమితమైన ప్రేమ.ఆయనకి తగ్గ భార్య ఆమె.ఎప్పుడూ చిరునవ్వు చెదరని మోముతో ,వచ్చినవారిని ప్రేమగా,ఆదరంగా పలకరించి వారి అవసరాలు కనుక్కుని తగ్గట్టు మెలిగేవారు ఆమె.వారికి ముగ్గురు సంతానం.ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు.ముగ్గురూ ఆధ్యాత్మిక రంగం లో తండ్రి అడుగుజాడల్లో,మంచితనం ,మృదువైన మాటలో తల్లి చేయి పట్టుకొని నడుస్తున్న వారే
ఆదిగో నిత్యసూరులు... అచ్యుత నీ పద దాసులు.. :
భగవంతుడి ఆజ్ఞగా, శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామి వారి సంకల్పం తో ఎందరో మహానుభావుల,తనను ప్రేమించే వారి సమక్షం లో విశాఖపట్నం లో2003 వ సంవత్సరం లో సహస్రచంద్ర దర్శనాన్ని పూర్తి చేసుకొని ,ఆ ఆనందపు మైమరపు నుంచి అందరూ తేరుకోకముందే 2003 జూన్ 7 వ తారీఖు న తమ ఆచార్యుల పాద సన్నిధికి చేరారు.
భాగవత సంసేవనమే హరిని చేర్చు దారి:
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద జీయర్ స్వామి వారు నిర్వహించిన చాలా కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు.ఆయనకు ప్రేమపాత్రులు అయ్యేరు. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారికి ,వారు ఆశ్రమ స్వీకారం చేసిన దగ్గర నుంచి అత్యంత ప్రీతిపాత్రులుగా వున్నారు.చినజీయర్ స్వామి వారి మంగళాశాసనం తో 1986 సంవత్సరం దిమిలి లో 21 రోజులు భాగవత సప్తాహత్రయ మహా యజ్ఞం చేసేరు. కృష్ణ భక్తి ని నరనారాల్లో నింపుకున్న సీతారామ యతీంద్రులవారికి అత్యంత ఆత్మీయులు అయ్యారు అప్పలాచార్యులు గారు.వారి తరువాత ఆశ్రమస్వీకారం చేసిన లక్ష్మణయతీంద్రుల వారితో కలిసి కృష్ణభక్తి లో ములిగితేలేరు. వారితో కలిసి ఆడేరు... పాడేరు.
శ్రీమత్ ఉపనిషత్ సిధ్ధాంత ఆచార్య పీఠ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామి వారికి శ్రీభాష్యం అనుగ్రహించి వారికి ఆచార్య స్థానాన్ని అలంకరించారు.వీరి ఆధ్వర్యంలో అప్పలాచార్యుల వారి సహస్ర చంద్ర దర్శనం 2003 వ సంవత్సరం చాలా ఘనం గా జరిగింది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర జీయర్ స్వామి వారితో కూడా అత్యంత సన్నిహితులుగా మెలిగారు అప్పలాచార్యులు గారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు,కందాళ వెంకటాచార్య స్వామివారు (విజయనగరం),టి. పి.రామచంద్రాచార్య స్వామి వారు(సింహాచలం)... వీరు ముగ్గురూ అత్యంత సన్నిహితులు.వీరిని ముగ్గురిని అందరూ ఉత్తరాంధ్రత్రయం అని అనేవారట. పెద్దలు,మహానుభావులు ,భాగవతోత్తములు అయిన ఎందరి ప్రేమనో పొందారు.
కాకినాడలో వున్నప్పుడు సమీపం లో ఉన్న శాంతి ఆశ్రమంలో వేంచేసిన ఓంకార స్వామి వారిని తరుచూ దర్శించేవారట అప్పలాచార్యులు గారు .శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఉభయగోదావరి జిల్లాలలో పర్యటించినప్పుడు తనతో పాటుగా అప్పలాచార్యుల వారిని తీసుకొని వెళ్ళేవారట. కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీ స్వామివారు కాకినాడ వచ్చినప్పుడు ఆయనని కలిసి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు.సంత్ కేశవదాస్ గారు కాకినాడ వచ్చినప్పుడు ఆయన ఉపన్యాసానికి తెలుగు లో వ్యాఖ్యానం అప్పలాచార్యులు గారే చేసేవారట. శ్రీ సత్యసాయిబాబా వారి ఆజ్ఞ మేరకు ఆయన సమక్షం లో భగవంతుని సర్వ వ్యాపకత్వం మీద ఉపన్యసించి ఆయన ప్రేమకు పాత్రులు అయ్యారు. ఇస్కాన్ వారు అప్పలాచార్యుల వారిని "శ్రీ వైష్ణవ నారాయణ్" అని పిలిచేవారట.కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారితో సన్నిహిత సంబంధం మన స్వామి వారికి ఉండేది. ఇలా ఎందరో మహానుభావుల ప్రేమను పొందిన కారణ జన్ములు.. పుణ్యాత్ములు శ్రీభాష్యం వారు